సింగరేణి బొగ్గు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు, గని కార్మికులకు అన్యాయం జరగడానికి కాంగ్రెస్ విధానాలే కారణమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి పరిశ్రమ దేశంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించిందని రాజిరెడ్డి తెలిపారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న గత 11 ఏళ్లలో గని కార్మికులకు ఎంతో మేలు జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఏఐటీయూసీ తాకట్టు పెట్టిందని మిర్యాల రాజిరెడ్డి మండిపడ్డారు. ఏఐటీయూసీకి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
కారుణ్య నియామకాల ద్వారా వారసులకు తిరిగి ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్, టీబీజీకేఎస్లకే దక్కుతుందని రాజిరెడ్డి అన్నారు. కార్మికుల సంఖ్య తగ్గడానికి కూడా కాంగ్రెస్ విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు.



