కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. భారీ రద్దీ ఉంటుందని అంచనా వేసిన దేవస్థానం కొన్ని సేవల్లో మార్పులు చేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు ఈ వివరాలు ప్రకటించారు.
ప్రధాన ఆలయంలో నిలిపివేసే సేవలు
- ₹5,000 గర్భాలయ అభిషేకం, ₹1,500 సామూహిక అభిషేకాలను ఉత్సవాల్లో, ముఖ్యంగా రద్దీ రోజుల్లో నిలిపివేస్తారు.
- ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవ టికెట్ల అమ్మకం ఆపేశారు.
- అమ్మవారి అంతరాలయంలో జరిగే ₹1,000 కుంకుమార్చనను రద్దీ రోజుల్లో ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తారు.
- ఆర్జిత హోమాలు, కల్యాణోత్సవం యథావిధిగా కొనసాగుతాయి.
పంచమఠాల్లో ₹216కే అభిషేకం
ప్రధాన ఆలయంలో అభిషేకాలు లేకపోవడంతో భక్తులు ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం అనే ఐదు పంచమఠాల్లోని శివలింగాలకు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ ధర ₹216.
టికెట్ల బుకింగ్ ఎలా?
నవంబర్ నెల స్పర్శ దర్శనం, 14 రకాల ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. కోటాలో 80% ప్రభుత్వ 'మనమిత్ర' వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా, 20% అధికారిక పోర్టల్ (www.tms.ap.gov.in) ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇటీవల ఆలయాన్ని పరిశీలించిన చైర్మన్ అదనంగా 3 లడ్డూ కౌంటర్లు (మహిళలకు ప్రత్యేక కౌంటర్తో సహా) ఏర్పాటు చేయాలని, క్యూలో ఉన్న భక్తులకు తాగునీరు అందించాలని ఆదేశించారు.
తిరుపతిలోనూ కార్తీక మాసం ఏర్పాట్లు మొదలయ్యాయి. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు టీటీడీ కార్తీక మాస హోమాలు నిర్వహిస్తుంది. గృహస్థులు (ఇద్దరు) ₹500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.




