తిరుపతిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

తమ పార్టీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్లిన తనను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. నామినేషన్ పత్రాలను తన చేతుల్లోంచి లాక్కున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న నామినేషన్ కేంద్రం వద్ద జరిగింది. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ఎంపీ గురుమూర్తి విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతోందో చెప్పడానికి తామే ప్రత్యక్ష సాక్షులమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.