తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 7,448 కిలోమీటర్ల హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు నిర్వహించిన సంస్థాగత శిక్షణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, కాంట్రాక్టు సంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు.

కేవలం లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా రహదారులను నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది.