అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర నగరాల్లోని కాన్సులేట్‌లు కాక్రోచ్‌ జనతా పార్టీకి మద్దతుగా జరిగిన ప్రదర్శనలపై నిఘా పెట్టాయని ఆరుగురు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించారు. పమీలా జయపాల్‌, ఇల్హాన్‌ ఒమర్‌, జిమ్‌ మెక్‌గవర్న్‌, రషీదా త్లెయిబ్‌, ఎలియనోర్‌ హోమ్స్‌ నార్టన్‌, జీస్‌ గార్సియా ఈ ఆరోపణలు చేశారు.

ఈ చట్టసభ్యులు అమెరికా మంత్రి రూబియోకు లేఖ రాశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సమయంలో బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలను భారతీయ ప్రతినిధుల వద్ద ప్రస్తావించాలని వారు రూబియోను కోరారు.

13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరమని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను కలవాలని రూబియోను కోరారు.

పమీలా జయపాల్‌ చేసిన వ్యాఖ్యలను అమెరికాలో భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా తీవ్రంగా విమర్శించారు. వాటిని భారత అంతర్గత వ్యవహారాల్లో ఆమోదయోగ్యం కాని జోక్యంగా ఆయన పేర్కొన్నారు.

రూబియోకు రాసిన లేఖపై పమీలా జయపాల్‌ను డెమోక్రటిక్‌ నాయకుడు, వైట్‌ హౌస్‌ మాజీ సలహాదారు అజయ్‌ జైన్‌ భుటోరియా తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఆయన అన్నారు.

రూబియో వచ్చేవారం భారత్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.