ఎర్రగుంట్ల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్సై నాగమలు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ ఆదేశాల ప్రకారం పలు నిబంధనలు జారీ చేశారు.
నామినేషన్ల కార్యక్రమానికి వచ్చే అభ్యర్థులు, వారిని బలపరిచేవారు, ఒక విట్నెస్ మాత్రమే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోకి రావాలని పోలీసులు సూచించారు. ఒక అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు తమ వాహనాలను కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే నిలిపి, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఈ మండలంలో ఓటు లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కూడా నామినేషన్ల ప్రక్రియకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీసుల హెచ్చరికలను ధిక్కరించి ఎవరైనా వస్తే, మండల తాసిల్దార్ ఆదేశాల ప్రకారం సెక్షన్ 144 కింద కేసులు నమోదు చేస్తామని సీఐ విశ్వనాథరెడ్డి తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.



