హైదరాబాద్: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం 'వారణాసి'కి సంబంధించినదంటూ ఒక శాటిలైట్ ఇమేజరీ వీడియో సోమవారం ఆన్ లైన్ లో చర్చకు దారితీసింది. యాపిల్ మ్యాప్స్ నవంబర్ మధ్యలో అప్ డేట్ చేసిన హై-రిజల్యూషన్ చిత్రాల్లో హైదరాబాద్ లోని కోకాపేట వద్ద భారీ సెట్ కనిపించినట్లు ఒక అభిమాని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

వైరల్ అవుతున్న ఆ ఏరియల్ దృశ్యాల్లో బహుళ అంతస్తుల ఆలయ నిర్మాణాలు, నీటి కొలనులోకి దిగే రాతి మెట్లు, పడవలు, ప్రాచీన నగర నమూనాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆ చిత్రాల ప్రామాణికతను గానీ, అవి 'వారణాసి' సెట్ కు సంబంధించినవేనని గానీ చిత్ర బృందం అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఇప్పటికే షూటింగ్ ప్రధాన భాగాన్ని పూర్తి చేసుకున్న 'వారణాసి' ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్ఎక్స్, సీజీఐ, రీ-రికార్డింగ్, బహుభాషా డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు 'రుద్ర' పాత్రలో, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.