ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రాథమికంగా హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఈ వాతావరణ మార్పు సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్రలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు.
ఉరుములతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

