ఉత్తరాంధ్రలో రెండు భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రెండింటిపై మొత్తం రూ.3,376 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మూలపేట రసాయన పార్కు
శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు ప్రాంతంలో సుమారు 2,000 ఎకరాల్లో సమీకృత రసాయన పరిశ్రమల పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీ ఎంపికకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నట్లు అధికారులు చెప్పారు. పర్యావరణ, తీరప్రాంత నియంత్రణ (సీఆర్‌జెడ్) అనుమతుల ప్రక్రియను ఏపీఐఐసీ వేగవంతం చేసింది.
- ప్రధాన మౌలిక సదుపాయాలపై సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.1,000 కోట్లు కేంద్ర పథకం కింద గ్రాంటుగా రానున్నాయి.
- కోరమాండల్ ఇంటర్నేషనల్‌కు 450 ఎకరాలు కేటాయించారు. ఫాస్ఫారిక్ యాసిడ్, ఎరువుల తయారీకి ఆ సంస్థ రూ.2,250 కోట్లతో ప్లాంట్ పెట్టనుంది.
- మూలపేట పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు 2026 డిసెంబర్ నాటికి మొదలవుతాయని అంచనా.
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 2,001 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు మౌలిక సదుపాయాలకు రూ.1,876.66 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ.1,000 కోట్లు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం ఇస్తోంది. మొదటి దశ పనులకు రూ.546.77 కోట్ల కాంట్రాక్టు ఇప్పటికే ఇచ్చారు. 2033 నాటికి ఇక్కడ రూ.11,542 కోట్ల పెట్టుబడులు, సుమారు 27,360 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.




