హైదరాబాద్: హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారమైన నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలను పరిరక్షించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం 10.30 గంటలకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అధికారులతో భేటీ కానుంది. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు బోర్డుకు వినతిపత్రం సమర్పించనున్నారు.

పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో నాగార్జునసాగర్ కుడి వైపు నుంచి నీటిని మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొరంగం పనులు చేపడుతోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ నిర్మాణాలకు ఉన్న అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర నదీజల ఒప్పందాల ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీ సమగ్రంగా పరిశీలించాలని ప్రతినిధి బృందం కోరనుంది.

ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో తగినంత నీటి నిల్వలు లేకపోతే హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి సరఫరాకు ముప్పు వాటిల్లుతుందని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఆలస్యం చేసిందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.