హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 2024 సెప్టెంబర్ 27న విడుదలైన 'దేవర' చిత్రం బుల్లితెర ప్రసార హక్కులపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులు రెండేళ్లకు పైగా అమ్ముడుపోకుండా ఉండిపోయాయి.
తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 2027లో ప్రారంభం కానున్న కొత్త తెలుగు జీఈసీ ఛానల్ 'సోనీ తెలుగు' ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈటీవీ కూడా ఈ రేసులో ఉన్నప్పటికీ, చివరకు సోనీ గ్రూప్ సరసమైన ధరకు డీల్ పూర్తి చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ ఒప్పందం అన్ని భాషల శాటిలైట్ హక్కులకు వర్తిస్తుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఛానల్ ప్రారంభానికి ముందే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' సహా పలు సినిమాల లైబ్రరీని సోనీ తెలుగు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
అయితే, 'దేవర' శాటిలైట్ డీల్ విలువ ఎంతనేది వెల్లడి కాలేదు. సోనీ టీవీ గ్రూప్ గానీ, చిత్ర నిర్మాతలు గానీ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.



