తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘తెలంగాణ క్లైమేట్ రెసిలెంట్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్’ (తెలంగాణ-కృతి) పథకానికి జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్ల (500 మిలియన్ యూరోలు) విదేశీ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ (డీఈఏ) స్రీనింగ్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని నమస్తే తెలంగాణ నివేదించింది.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన స్రీనింగ్ కమిటీ 167వ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7,143 కోట్లు అని నమస్తే తెలంగాణ పేర్కొంది.
సమావేశంలో తెలంగాణ పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి పాల్గొన్నారు. సదరు ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రాధాన్యతలు, అమలు విధానాన్ని ఆమె వివరించారు.
ఈ ప్రాజెక్టును తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్‌ఐడీసీ) చేపడుతుందని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఈ ప్రాజెక్టు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది. ఇది రాష్ట్రంలో స్థిరమైన పట్టణాభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.



