అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సాయంత్రం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొననున్నారు.
శుక్రవారం ఉదయం సమావేశమైన కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను అనుసంధానం చేసే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా, అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను సమానంగా 50 శాతం పెంచే ప్రతిపాదన ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రతిపాదన ప్రకారం లోక్సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచి, 2051 వరకు ప్రస్తుత అంతర్రాష్ట్ర సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా నవంబర్ 30న లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించగలమని కేంద్ర ప్రభుత్వం ధీమాగా ఉంది.
మరోవైపు విపక్ష కూటమి 'ఇండియా' నేతలు శనివారం (నవంబర్ 28) ఉదయం 11:30 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. 1971 జనాభా లెక్కల ఆధారిత నిష్పత్తిని మరో 25 ఏళ్లు పొడిగించాలని, తమిళనాడు 7.18 శాతం (39 సీట్లు) వాటాకు భంగం కలగకూడదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. సమాన శాతం పెంపుతోనూ ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం పెరుగుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.




