అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం క్లోరిన్ గ్యాస్ లీక్ కలకలం రేపింది. సుమారు పదేళ్ల క్రితం నీటి శుద్ధి పైలెట్ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చి వదిలేసిన 500 లీటర్ల ట్యాంకర్ నుంచి వాయువు వెలువడటంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు.

ఘాటైన వాసన వ్యాపించడంతో గ్రామస్తులలో కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు మంటలు, తలతిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. అక్కడ పొదల్లో మొత్తం మూడు క్లోరిన్ ట్యాంకర్లు ఏళ్లుగా వదిలేసి ఉన్నాయని స్థానికుడు రాజు తెలిపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక గ్యాస్ కిట్లు ధరించిన సిబ్బంది ట్యాంకర్‌పై నీటిని పిచికారీ చేసి వాయు తీవ్రతను తగ్గించి లీకేజీని పూర్తిగా అరికట్టారని ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక అధికారి (DFO) ఏ.వి. శంకర్ రావు వెల్లడించారు.

సుమారు దశాబ్దం క్రితం నీటి శుద్ధి ప్లాంట్ కోసం ఈ ట్యాంకర్లను తెచ్చి ప్రాజెక్టు స్థలంలోనే వదిలేశారని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, పరిస్థితి అదుపులో ఉందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాంకర్‌ను పూర్తిగా సురక్షితంగా తరలించేందుకు కొవ్వూరు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని కూడా రప్పించారు. మిగిలిన రెండు పాత ట్యాంకర్ల స్థితిని అధికారులు తనిఖీ చేస్తున్నారు.