హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పెవిలియన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అనుకూలమైన ప్రదేశమని సీఎం రేవంత్ రెడ్డి హ్యుందాయ్ ప్రతినిధులకు వివరించారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ఎండీ చాంగియోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కార్ల తయారీని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

దేశంలో హైదరాబాద్ కేంద్ర స్థానంలో ఉందని, ఆరు మెట్రోపాలిటన్ భారతీయ నగరాల్లో హైదరాబాద్ కాస్మోపాలిటన్, సురక్షితమైన, అత్యంత నివాసయోగ్యమైన నగరంగా పేరు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందానికి తెలిపారు.

జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ (NIMZ)లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ సదుపాయం పనులను వేగవంతం చేయడానికి అన్ని విధాలా మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి హ్యుందాయ్ మోటార్ ఇండియా నాయకత్వానికి హామీ ఇచ్చారు.

ఈ సదుపాయం కోసం రూ. 8,528 కోట్ల పెట్టుబడి, 4,276 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. 678 ఎకరాల్లో దశలవారీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.