సియాటిల్: అమెరికాలోని సియాటిల్‌లో భారతీయ కుటుంబాలు జరుపుకుంటున్న దీపావళి వేడుకలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. సియాటిల్ సెంటర్ ఆర్మరీలో నృత్య ప్రదర్శన జరుగుతుండగా తీవ్ర మితవాద కార్యకర్తలు జేక్ లాంగ్, థామస్ అలెన్ వేదిక ముందుకు వచ్చి “డిపోర్ట్ ఆల్ డాట్ హెడ్స్”, “స్టాప్ హిందూ రీప్లేస్మెంట్ ఆఫ్ క్రిస్టియన్స్” అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికే వారిని బయటకు పంపించారు.
వేడుకలో పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో కుటుంబాలు పాల్గొన్నాయి. ఘటన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దక్షిణాసియా వారిని, ముఖ్యంగా హిందువులను కించపరిచేందుకే ‘డాట్ హెడ్స్’ అనే పదం వాడతారని ప్రవాస సంఘాలు పేర్కొన్నాయి.
ఖండనలు
- “ఈ జాత్యహంకార ప్రదర్శన అసహ్యం కలిగించింది. ఇలాంటి విద్వేషానికి మా నగరంలో, ఈ దేశంలో చోటు లేదు” అని వాషింగ్టన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
- హిందువులపై విద్వేషాన్ని అణచివేయాలని కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.
- హిందూ వ్యతిరేక జాత్యహంకారానికి అమెరికాలో చోటు లేదని వైట్ హౌస్ మాజీ సలహాదారు అజయ్ జైన్ భుటోరియా అన్నారు.
అప్రమత్తంగా ఉండాలని సూచన
ఇతర వేడుకలనూ అడ్డుకుంటామని ఈ కార్యకర్తలు ప్రకటించినందున అప్రమత్తంగా ఉండాలని కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (CoHNA) సూచించింది. అనుమానాస్పద, విద్వేషపూరిత కార్యకలాపాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని హిందూప్యాక్ట్ కోరింది. 2021 జనవరి 6 క్యాపిటల్ దాడిలో పాల్గొన్న లాంగ్‌కు 2025లో ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ ఘటనపై పోలీసులు గానీ, వేదిక నిర్వాహకులు గానీ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.




