హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి పైరసీ భూతం కలవరపెడుతోంది. నవంబర్ 20న విడుదలైన 'ఆకాశంలో ఒక తార' చిత్రంతో పాటు ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రణబాలి', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం (హౌస్ నంబర్ 47)' సినిమాల పైరసీ కాపీలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. 'ఆకాశంలో ఒక తార' విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో లీక్ కావడం నిర్మాతల్లో ఆందోళన కలిగించింది.
ఈ నాలుగు చిత్రాలు ఓ పైరసీ వెబ్సైట్లో అక్రమంగా అప్లోడ్ అయినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు గుర్తించారు. ఆయన శుక్రవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. 'రణబాలి', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం' చిత్రాలను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్లో దుండగులు క్యామ్కార్డర్తో రహస్యంగా చిత్రీకరించినట్లు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది.
ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్నూలు థియేటర్లోని సీసీటీవీ ఫుటేజ్, షో వివరాలు, టికెట్ బుకింగ్ రికార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. వెబ్సైట్ నిర్వాహకులు, అప్లోడ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.



