హైదరాబాద్‌ / ముంబై: అల్లు అర్జున్‌, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ సైన్స్‌-ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రం 'రాకా' (గతంలో #AA22xA6) కాస్టింగ్‌పై కొత్త గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గోవిందా ఒక చిన్నదైనా కీలకమైన పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలు నిజమైతే, దక్షిణాది సినిమాలో గోవిందాకు ఇదే తొలి చిత్రం కానుంది. 'రంగీలా రాజా' తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించే ప్రాజెక్ట్‌ ఇదే అవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రమ్యకృష్ణ, యోగి బాబు, జిమ్‌ సర్భ్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

వేద కాలం అంశాలను వర్తమానంతో ముడిపెడుతూ సాగే ఈ సినిమా కోసం ఒకేసారి 37 మంది కళాకారులతో రియల్‌-టైమ్‌ మోషన్‌ క్యాప్చర్‌ నిర్వహించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పినట్లు సమాచారం. 2027లో విడుదల లక్ష్యంగా షూటింగ్‌ జరుగుతుండగా, డిసెంబర్‌లో ప్రమోషనల్‌ అప్‌డేట్‌ రావచ్చని ప్రచారం సాగుతోంది.