భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్టోబర్ 22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది.

శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తిరుపతి విమానాశ్రయం పూర్తిగా జలమయమైంది. ఈ ఘటనలో విమానాశ్రయ ప్రాంగణంలోని కొన్ని గోడలు కూడా కూలిపోయాయి.

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం, ఈ జిల్లాల్లో వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ వర్తిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నెల చివరిలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.