హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65 (ఎన్.హెచ్-65) విస్తరణ పనులు 2027 జనవరి నాటికి ప్రారంభం కానున్నాయి. ఈ కీలకమైన రహదారి విస్తరణతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సురక్షితంగా, వేగంగా మారనుంది.
ఈ ప్రాజెక్టు టెండర్ల దాఖలుకు 2026 నవంబర్ 11 వరకు గడువు విధించినట్లు ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు వేగవంతం కానున్నాయి.
సోమవారం న్యూఢిల్లీలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, సభ్యుడు విప్నేష్ శర్మలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాదాల నివారణకు ప్రస్తుత నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లు, ఇరువైపులా సర్వీస్ రోడ్లుగా వెంటనే విస్తరించాలని మంత్రి కోరారు.
ఈ విస్తరణ పనులు పూర్తయితే, హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మార్గంలో ప్రయాణించే వారికి మెరుగైన రహదారి సౌకర్యం లభిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.



