ఈ ఏడాది సూపర్ ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయానికి నీటి కొరతతో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, వృథా చేయవద్దని ప్రభుత్వాలు, అధికారులు, నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తున్నారు.
తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నీటి వృథాను నిరోధించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు వంటి వాణిజ్య సంస్థలతో పాటు ఎవరైనా నీటిని దుర్వినియోగం చేస్తే జరిమానాతో పాటు నీటి సరఫరాను నిలిపివేస్తామని జలమండలి హెచ్చరించింది.
నీటి వృథాకు పాల్పడే వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను కూడా నిలిపివేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ప్రజలు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరింది.

