ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో హ్యుండాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్ఎంఐఈ) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్‌యెన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో హ్యుండాయ్ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) సెంటర్ పురోగతిపై సమీక్షించారు.
జహీరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని సీఎం రేవంత్ రెడ్డి హ్యుండాయ్ ప్రతినిధులను ఆహ్వానించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు హైదరాబాద్ అనుకూలమైన ప్రదేశమని ఆయన వివరించారు.
తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఆర్ అండ్ డీ ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు రానున్న కొద్ది నెలల్లోనే సిద్ధంగా ఉన్నట్లు హ్యుండాయ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.



