అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వీటిలో ఒకటి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వచ్చే వారంలో ఈ తుఫాను ఏర్పడే అవకాశంపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది.
ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రాలో వర్షపాతం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు.

