ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, ప్రజలు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, కాలువల్లో నీటిని మోటర్ల ద్వారా వినియోగించొద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్ 16న ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటి వనరుల సంరక్షణ కోసం ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు.
ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించి నీటిని మోటర్ల ద్వారా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ మేరకు జారీ చేసిన ఆదేశాల కాపీలను తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ, విద్యుత్తు శాఖ అధికారులకు నీటిపారుదల శాఖ అందజేసింది. క్షేత్రస్థాయిలో అమలుకు సహకరించాలని కోరింది.
ప్రస్తుతం వరి, పత్తి చేన్లు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకట్రెండు తడులు ఇస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
నీటిపారుదల శాఖ ఆదేశాలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు మరింత పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు.

