హైదరాబాద్: మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాదయాత్ర నిర్వహించనున్నారు. 'హైదరాబాద్ వాక్స్ - నషా ముక్త్ భారత్' పేరుతో అంబర్‌పేట ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ముషీరాబాద్, అమీర్‌పేట మీదుగా సాగి 27న జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ వద్ద సంకల్ప సభతో ముగుస్తుంది.

దేశంలో డీ-అడిక్షన్ కేంద్రాల సంఖ్యను ప్రస్తుత 300 నుంచి 2,000కు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంగళవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి తెలిపారు. నషా ముక్త్ భారత్ మిత్ర వాలంటీర్లను భాగస్వామ్యం చేస్తూ 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధించడమే లక్ష్యమని చెప్పారు.

డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే బాధిత యువతను నేరస్థులుగా కాకుండా చికిత్స అవసరమైన వారిగా చూడాలని ఆయన సూచించారు. పంజాబ్ పరిస్థితిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ అంబర్‌పేట, బోరబండ వంటి ప్రాంతాల్లోనూ యువత మత్తుకు బానిసవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయించకుండా ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డి కోరారు. ఈ రాజకీయేతర ప్రచారానికి సినీ నటులు ప్రభాస్, అక్కినేని నాగార్జున, వెంకటేష్, చిరంజీవి మద్దతు తెలిపి ప్రచార టీ-షర్ట్‌లను ఆవిష్కరించారు.