హైదరాబాద్: వినోద రంగంలో సరికొత్త ప్రయోగానికి లయన్స్‌గేట్ ప్లే శ్రీకారం చుట్టింది. మహాభారతంలోని ఏకలవ్యుడి ఇతివృత్తంతో, పూర్తిస్థాయి సింథటిక్ AI నటుడు 'యుగ్ ఆర్.ఏఐ' (Yug R.Ai) ప్రధాన పాత్రలో 'ఏకలవ్య' వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంతో 8 ఎపిసోడ్లు

'హీరామండి' ఫేమ్ విభు పురి దర్శకత్వంలో తొలి సీజన్‌ను 8 ఎపిసోడ్లుగా నిర్మిస్తున్నారు. గూగుల్ క్లౌడ్ AI సాంకేతికత సహకారంతో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

బహుళ సీజన్ల ఫ్రాంచైజీ లక్ష్యం

'ఏకలవ్య'ను బహుళ సీజన్ల ఫ్రాంచైజీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 'యుగ్ ఆర్.ఏఐ' కేవలం ఆరంభం మాత్రమేనని లయన్స్‌గేట్ ప్లే సీఈఓ రోహిత్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్, యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో లయన్స్‌గేట్ ప్లే విస్తరణతో పాటు 2027లో ప్రీమియర్ కానుంది.