అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వీటిలో ఒకటి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది.

వచ్చే వారంలో ఈ తుఫాను ఏర్పడే అవకాశంపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం వరకు దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోంది.

ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రాలో వర్షాలు పడతాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ, ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు.