హైదరాబాద్: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్రబృందం ఎంతో గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, ఆ సినిమా భారీ సెట్ దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. యాపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్ వినియోగదారుల కోసం హై-రిజల్యూషన్ 3డీ మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో, కొందరు నెటిజన్లు హైదరాబాద్ శివార్లలోని కోకాపేట ప్రాంతంలో ఉన్న సెట్‌ను గుర్తించారు.
యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ఈ భారీ సెట్ ఏరియల్ దృశ్యాలను స్క్రీన్ రికార్డ్ చేసి కొందరు ఎక్స్ వేదికగా పంచుకోవడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ 3డీ మ్యాప్స్‌లో విశాలమైన ప్రాంగణంతో పాటు చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ నీటి కొలను కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఈ వైరల్ వీడియోపై మహేశ్ బాబు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చిత్రబృందం ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్న సెట్ వివరాలను ఇలా మ్యాప్స్ ద్వారా లీక్ చేయడం సరికాదని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, గతంలోనే అంతర్జాతీయ మీడియాకు సెట్ చూపించారు కాబట్టి ఇందులో కొత్తగా ఏమీ లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం 'వారణాసి' ప్యాచ్‌వర్క్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ, డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రుద్ర పాత్రలో మహేశ్ బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



