తెలంగాణలో ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
శనివారం ఎర్రమంజిల్లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై ఆమె సమీక్షించారు.
తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.
ఈ సమీక్షలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రస్తుత తాగునీటి సరఫరా స్థితిగతులు, రాబోయే వేసవిలో ఎదురయ్యే అవసరాలపై చర్చ జరిగింది. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులు సమగ్రంగా చర్చించారు.

