నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్‌ అల్లూరి వెంకట సత్యనారాయణ (ఏవీఎస్‌) రాజు కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఏవీఎస్‌ రాజు 1937లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో జన్మించారు. ఆయన దేశవ్యాప్తంగా అనేక అద్భుత ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన మృతిపట్ల తెలంగాణ, ఏపీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కూడా ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపాయి.

నిర్మాణ రంగంలో ఏవీఎస్‌ రాజు చేసిన కృషికిగాను 2006లో భారతీయ బిల్డర్స్‌ అసోసియేషన్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో ఆయనను గౌరవించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా, నిర్మాణ రంగంలో మార్గదర్శకుడిగా ఏవీఎస్‌ రాజు సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాపార రంగానికి తీరని లోటు.