రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-ప్రొక్యూర్మెంట్ ఛార్జీల పేరుతో ఊహించని భారాన్ని మోపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ సవరణలతో జీవో నంబరు 6ను విడుదల చేసింది.
ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ పనుల్లో పాల్గొనే కాంట్రాక్టర్లు, బిడ్డర్లపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
ఒకవైపు పాత బకాయిలు, చేసిన పనులకు సంబంధించి వేల కోట్ల రూపాయల బిల్లులు రాక గుత్తేదారులు ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ-ప్రొక్యూర్మెంట్ ఛార్జీల పెంపు వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఈ ప్రొక్యూర్మెంట్ ఫీజుల పెంపు వల్ల బిల్లులు రాక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లకు ఇది మరింత నష్టం కలిగిస్తుంది. ప్రాజెక్టు విలువ ఎంత పెరిగితే గుత్తేదార్ల జేబులకు అంత కన్నం పడుతుంది.
చిన్న కాంట్రాక్టర్లకు కూడా ఈ కార్పస్ తప్పనిసరి కావడం, గతం కంటే మూడింతలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ టెండర్లపై కాంట్రాక్టర్లకు అప్పర్ క్యాప్ ఉండేది.
ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై కాంట్రాక్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



