హైదరాబాద్‌: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి నిర్వహిస్తున్న మూడు రోజుల 'హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషా ముక్త్ భారత్‌' పాదయాత్ర గురువారం రెండో రోజు కొనసాగింది.

రాత్రి బస అనంతరం ముషీరాబాద్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, లిబర్టీ, ఖైరతాబాద్‌ చౌరస్తా, పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట సత్యం థియేటర్‌ వద్ద ముగిసింది.

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద బ్యాడ్మింటన్ చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ యాత్రలో పాల్గొన్నారు. యువత క్రీడలు, వ్యాయామానికి అవును అని, డ్రగ్స్‌కు నో అని చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ యాత్ర ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో కాదని, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. గిరిజన రైతులను తప్పుదోవ పట్టించి గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించిన ఆయన, కేంద్రం-రాష్ట్రం కలిసి డ్రగ్స్‌ను అరికడతాయని తెలిపారు. నవంబర్‌ 27న జూబ్లీహిల్స్‌లో జరిగే ముగింపు సభకు చిరంజీవి, నాగార్జున, శ్రీశ్రీ రవిశంకర్‌ హాజరవుతారు.