హైదరాబాద్: 'రంగస్థలం' (2018) తర్వాత రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందనున్న 'ఆర్సీ 17' చిత్రం కోసం నిర్మాతలు శుక్రవారం అధికారిక క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశాయి.
16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న నటీనటులు ఆడిషన్ వీడియోలు, ప్రొఫైళ్లను src17casting@gmail.com లేదా వాట్సాప్ నంబర్ 9110564651కు పంపాలని చిత్ర బృందం కోరింది. నవంబర్ 1న చిరంజీవి తొలి క్లాప్‌తో ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
మరోవైపు ఈ భారీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో కియారా అద్వానీ, సారా అర్జున్ పేర్లు వినిపించగా, తాజాగా 'ఆకాశంలో ఒక తార'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాత్విక వీరవల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అల్లు అరవింద్ ఇప్పటికే నాగచైతన్య 'ఎన్సీ 25'లో సాత్వికను ఖరారు చేసిన నేపథ్యంలో 'ఆర్సీ 17' హీరోయిన్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.



