హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు, కోటి ఓట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), పార్టీ సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 92,35,833 ఓట్లు సాధించి 64 స్థానాల్లో విజయం సాధించిందని సీఎం గుర్తుచేశారు. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 90 రోజుల్లో 48 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేశామని, ఇది దేశంలోనే అత్యధికమని ఆయన తెలిపారు.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వంటి నేతలకు తగిన గుర్తింపు లభించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదవుల కోసం గాంధీ భవన్ లేదా ఢిల్లీ చుట్టూ తిరగవద్దని, గ్రామాల్లోకి వెళ్లి పేదల ఇళ్ల వద్ద పనిచేయాలని నేతలకు సూచించారు.
రాష్ట్రంలో ప్రతి కార్యకర్త, నాయకుడి పనితీరును, ప్రవర్తనను పార్టీ నాయకత్వం నిశితంగా గమనిస్తోందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.




