హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమాలోని వివాదంపై నటి శ్రుతి హాసన్ తాజాగా స్పందించారు. 'ఆకాశంలో ఒక తార' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'పెద్ది' వివాదం, నటి జాన్వీ కపూర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమెకు ప్రశ్న ఎదురైంది.
గతంలో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ కపూర్, 'పెద్ది'లో తన పాత్రను చూపించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అప్పుడే గట్టిగా మాట్లాడాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పందించిన శ్రుతి హాసన్, మరో నటి వ్యక్తిగత అనుభవం గురించి తాను మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ఇతరుల పరిస్థితి తెలియకుండా వారి తరఫున తాను మాట్లాడలేనని, అలాగే తన గురించి వారు మాట్లాడలేరని ఆమె పేర్కొన్నారు.
'పెద్ది'లోని 'హల్లల్లో' ప్రత్యేక గీతం గురించి శ్రుతి మాట్లాడుతూ, డ్యాన్స్ చేయడం, గ్లామరస్‌గా కనిపించడం తనకు ఇష్టమేనని చెప్పారు. అయితే ఎవరినో మెప్పించేందుకు తాను అలాంటి పాటలు చేయనని, తనకు నచ్చని దుస్తులు వేసుకోనని తేల్చిచెప్పారు. ఏదైనా సన్నివేశం లేదా కాస్ట్యూమ్ అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే నో చెబుతానని, దానివల్ల వాదనలు జరిగినా, కష్టమైన నటి అని పేరు వచ్చినా తాను పట్టించుకోనని ఆమె అన్నారు.
షూటింగ్ సమయంలో తన టీమ్ ఎంతో జాగ్రత్తగా ఉంటుందని, పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని శ్రుతి వివరించారు. శ్రుతి హాసన్ స్పందనపై నెటిజన్ల నుంచి మిశ్రమ, సానుకూల స్పందనలు వస్తున్నాయి. సినిమా విడుదలయ్యాక విమర్శలు చేసేకంటే, చిత్రీకరణ ముందే హద్దులు నిర్ణయించుకోవడం మంచిదంటూ పలువురు సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలను ప్రశంసిస్తున్నారు.



