సింగరేణి సంస్థ అభివృద్ధి, కొత్త గనుల సేకరణ, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు రూ.596 కోట్ల లాభాల వాటాను పంపిణీ చేశారు.

సింగరేణి భవిష్యత్తును బలోపేతం చేయడానికి కొత్త గనుల సాధనతో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మారుతున్న బొగ్గు మార్కెట్‌లో ఇతర సంస్థలతో పోటీపడటానికి నాణ్యమైన బొగ్గును సరసమైన ధరకు అందించడం అవసరమని భట్టి విక్రమార్క అన్నారు. ఉత్పాదకతను పెంచడం, అనవసర ఖర్చులను తగ్గించడం కూడా ముఖ్యమని ఆయన తెలిపారు.