పనాజీ, నవంబరు 20: గోవా వేదికగా నవంబరు 20 నుంచి 28 వరకు నిర్వహించే 57వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఆరు తెలుగు చిత్రాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎఫ్‌డీసీ సంయుక్తంగా ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్స్’ థీమ్‌తో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ ఏడాది తెలుగు విభాగంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘సింగ్ గీతం’, అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవివర్మ నంబూరి దర్శకత్వంలోని ‘చెన్నై లవ్‌స్టోరీ’, ధనుష్ దండు రూపొందించిన ‘వై, వాణి?’, ప్రవీణ్ దర్శకత్వం వహించిన ‘విన్’, దేవకట్టా తెరకెక్కించిన ‘మయసభ’ ప్రదర్శితం కానున్నాయి. ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ వెబ్ సిరీస్ ఉత్తమ ఓటీటీ విభాగంలోనూ పోటీపడుతోంది.
గోల్డెన్ జూబ్లీ విభాగంలో ‘భక్త కన్నప్ప’
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇఫీ గోల్డెన్ జూబ్లీ విభాగంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బాపు దర్శకత్వంలో 1976 మే 26న విడుదలైన ఈ చిత్రం పునరుద్ధరించిన ప్రింట్‌ను ప్రదర్శించనున్నారు.
శివలింగం నుంచి రక్తం కారడాన్ని ఆపేందుకు తన కళ్లను సమర్పించిన పరమ భక్తుడు కన్నప్ప నాయనార్ భక్తి జీవనాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ప్రకృతి పరిరక్షణ, కుటుంబ బంధాలు, వ్యక్తిగత లక్ష్యాలు, రాజకీయ పరిణామాలతో పాటు ఆధ్యాత్మిక భక్తిని ప్రతిబింబించే ఈ తెలుగు చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్నాయి.



