ప్రకృతి విపత్తు ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. వికారాబాద్ లో శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఎల్ నినో వణికిస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని ఆయన సూచించారు.
ప్రజా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని స్పీకర్ కోరారు. ముఖ్యంగా రైతులు సాగుకు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
వికారాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్యతో కలిసి స్పీకర్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వికారాబాద్ టౌన్ లోని శివసాగర్ చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో సుందరీకరణ చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.

