హైదరాబాద్: తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి సంబంధించి కొరియోగ్రాఫర్ సుమలత శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు కోరారు. నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుడు వైవిఎస్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ఈసీ సమావేశంలో పల్లి కేశవరావుపై జరిగిన దాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై నందమూరి బాలకృష్ణకు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు, నిర్మాతల మండలికి, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు సుమలత క్షమాపణ తెలిపారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం తనను తప్పుదోవ పట్టించారని, ఇకపై ఫెడరేషన్తో కలిసి పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఈ వివాదం పూర్తిగా కార్మిక సంఘం అంతర్గత వ్యవహారమేనని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు లేదని తుమ్మల ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని బాలకృష్ణ సూచించినట్లు తెలిపిన ఆయన, భవిష్యత్తులో ఫిల్మ్ ఛాంబర్ లేదా సభ్యులపై దాడులకు పాల్పడితే ఐదేళ్ల పాటు సహాయనిరాకరణ విధిస్తామని హెచ్చరించారు.
పరిశ్రమలో చిన్న సమస్యలను పెద్దవి చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని వైవిఎస్ చౌదరి అన్నారు. జానీ మాస్టర్‌పై ఉన్న నిషేధం కూడా త్వరలో తొలగిపోయి ఆయన మళ్లీ తెలుగు సినిమాల్లో పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.



