హైదరాబాద్: రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. ఆరు సన్నబియ్యం రకాలకు గరిష్ఠ చిల్లర ధరలను ఖరారు చేసి, అంతకుమించి అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం హెచ్చరించింది.

కిలోకు గరిష్ఠ ధరలు

  • బీపీటీ, కేఎన్ఎం: ₹66
  • ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా: ₹74
  • హెచ్ఎంటీ, జేఎస్ఆర్: ₹79

కొరత లేకపోయినా దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచుతున్నారని, మార్కెట్‌లో సరిపడా నిల్వలు ఉన్నాయని శాఖ స్పష్టం చేసింది. నిల్వలు అందని చిల్లర వ్యాపారులు టోకు వ్యాపారులపై ఆధారపడకుండా జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఇండెంట్ పెట్టి నేరుగా మిల్లర్ల నుంచి కొనుగోలు చేయవచ్చని పౌరసరఫరాల డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌కు తరలింపు, ధరల పెంపునకు పాల్పడేవారిపై కేసులు పెడతామని, పదేపదే తప్పు చేసేవారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు.

తనిఖీల్లో 25 కిలోల బస్తాలపై 26 కిలోలని లేబుల్ వేయడం, అసలు ఎంఆర్‌పీపై అధిక ధర స్టిక్కర్లు అతికించడం వంటి మోసాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ బియ్యం ధరలపై మంగళవారం కేబినెట్‌లో చర్చ జరిగింది. ధరల భారం ప్రజలపై పడకూడదని, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. రైతు బజార్లలో తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.