తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదైంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 14.5 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో ఒక్క రోజు 20 శాతం నీటిని పొదుపు చేస్తే 30.28 కోట్ల లీటర్ల నీరు మిగులుతుందని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇదే మాదిరిగా నీటిని పొదుపు చేయాలని అధికారులు కోరారు. నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు గుర్తు చేశారు.

