తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం నాబార్డు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) ద్వారా రూ.640.67 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో సర్కారు బడుల్లో మౌలిక వసతులు, డిజిటల్ విద్యను మెరుగుపరచనున్నారు.
ఈ నిధుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల రెండు సవరించిన జీవోలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి.
నాబార్డు ఆర్ఐడీఎఫ్-29 కింద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) మౌలిక వసతుల విస్తరణకు రూ.352.80 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ బడులను డిజిటలైజ్ చేయడంలో భాగంగా ఐసీటీ వసతులను విస్తరించనున్నారు.
పేద విద్యార్థులకు హైటెక్ విద్యను అందించడమే లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. అక్టోబర్ 20, 2026 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తోంది.