తెలంగాణ పల్లెల్లో నీటి కొరతపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం డప్పు చాటింపులను తిరిగి ప్రారంభించనుంది. ఎన్ నినో పరిస్థితుల కారణంగా ఏర్పడిన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఈ కార్యాచరణను సిద్ధం చేశారు.
పండుగల తర్వాత అన్ని గ్రామాల్లో డప్పు చాటింపులు నిర్వహించాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. వాతావరణ మార్పులు, నీటి కొరత, విద్యుత్ సంక్షోభం వంటి ముప్పుల నుంచి గ్రామాలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామీణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించనుంది.
దసరా తర్వాత దీపావళి వరకు గ్రామ సభల్లో నీరు, విద్యుత్ పొదుపు చర్యలపై చర్చలు జరుగుతాయి. ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి, ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి చైతన్యం చేస్తారు.
భూగర్భ జలాలను కాపాడుకోవడం, బిందు సేద్యం, సమాంతర సేద్యం వంటి పద్ధతులను వివరిస్తారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వృథాను అరికట్టేందుకు సరళమైన పద్ధతులను క్షేత్రస్థాయి అధికారుల సమక్షంలో తెలియజేస్తారు.

