తెలంగాణ రాష్ట్రంలోని 315 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తుమ్మల నాగేశ్వరరావు శనివారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో కరువు నివారణ, రైతులకు ఆర్థిక భరోసా, పంటల కొనుగోలు వంటి అంశాలపై రాష్ట్రం తరఫున పలు సూచనలు చేశారు.
తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన తుమ్మల, రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు రాష్ట్రంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ సంస్థలు, విశ్వవిద్యాలయాల సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు.

