హైదరాబాద్: యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, డిజిటల్ కంటెంట్ (AVGC-XR) రంగాల సమ్మేళనమైన ‘ఇండియా జాయ్–2026’ వేడుకలను డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ఏవీజీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వివరాలు వెల్లడించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో 15 ఎకరాల విస్తీర్ణంలో జరిగే ఈ వేడుకలకు 20కి పైగా దేశాల నుంచి 8,500 మంది పరిశ్రమ ప్రతినిధులు, 80,000 నుంచి లక్ష మందికి పైగా సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. నెట్ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా 200కు పైగా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.
సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ AI ఫిల్మ్ ఫెస్టివల్ (HAIFF), కామిక్ కాన్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్ సహా 15కు పైగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు.
డిసెంబర్ 8న అంతర్జాతీయ రెడ్ కార్పెట్ వేడుక జరగనుండగా, డిసెంబర్ 9న ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరీల వేదికను ప్రారంభించనున్నారు.



