తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అక్టోబర్ 18 ఆదివారం 'పోలం బాట' కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవసాయ పొలాలను సందర్శించారు. రైతులు, వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
వ్యవసాయ విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలపై అధికారులు సమాచారం తీసుకున్నారు. విద్యుత్ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించారు. వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్, యాదాద్రి, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
చౌదర్‌గూడ, చిత్తాపూర్, ఉయ్యాలవాడ, నాదంపల్లి, నిజాంపూర్, చౌట్లపల్లి, పుట్టపల్లి, తాడూర్, జంగంపేట, గుమ్మడిదాల, కొత్తపల్లి, లక్ష్మీపతిగూడెం వంటి గ్రామాల్లోని వ్యవసాయ ఫీడర్ ప్రాంతాలను అధికారులు సందర్శించారు. విద్యుత్ సరఫరాపై రైతుల అభిప్రాయాలను స్వీకరించారు.



