న్యూయార్క్: దీపావళిని అమెరికాలో జాతీయ (ఫెడరల్) సెలవుదినంగా గుర్తించాలన్న ప్రతిపాదన మళ్లీ అమెరికా కాంగ్రెస్ ముందుకొచ్చింది. న్యూయార్క్ డెమొక్రాట్ సభ్యురాలు, కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (క్యాపాక్) చైర్పర్సన్ గ్రేస్ మెంగ్ ‘దీపావళి డే యాక్ట్’ను ప్రతినిధుల సభలో మళ్లీ ప్రవేశపెట్టారు. 19 మంది చట్టసభ సభ్యులు బిల్లుకు సహ ప్రతిపాదకులుగా ఉన్నారు.
బిల్లు ముఖ్యాంశాలు
- దీపావళి రోజున దేశవ్యాప్తంగా ఫెడరల్ సెలవు; చట్టమైతే అమెరికాలో ఇది 12వ ఫెడరల్ సెలవు
- సహ ప్రతిపాదకుల్లో భారత సంతతి సభ్యులు అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రమణ్యం, శ్రీ థానేదార్
- హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఈ పండగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించడం లక్ష్యం
‘‘దీపావళి చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక’’ అని మెంగ్ అన్నారు. ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సిందని పేర్కొన్నారు. సియాటిల్‌లో దీపావళి వేడుకల్లో ఇటీవల జరిగిన అలజడిని ఆమె ‘జాత్యహంకార, హిందూ వ్యతిరేక’ చర్యగా ఖండించారు.
రాష్ట్రాల స్థాయిలో పెన్సిల్వేనియా 2024లో దీపావళి దినాన్ని అధికారికంగా గుర్తించగా, కాలిఫోర్నియా ఈ ఏడాది జనవరి 1 నుంచి దీపావళిని రాష్ట్ర సెలవుల జాబితాలో చేర్చింది. ఫెడరల్ సెలవుగా మారాలంటే బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం పొంది అధ్యక్షుడి సంతకంతో చట్టం కావాల్సి ఉంటుంది.




