అమెరికాలో ఇప్పటికే హెచ్-1బీపై పనిచేస్తున్నవారు అదే కంపెనీలో, అదే ఉద్యోగంలో వీసా పొడిగించుకునేటప్పుడు, గతంలో ఆమోదం పొందిన దరఖాస్తును అధికారులు ‘గౌరవించాలి’ (డిఫరెన్స్) అనే నిబంధన ఉంది. దీనిని తొలగించాలని డీహెచ్ఎస్/యూఎస్‌సీఐఎస్ అక్టోబర్ 14న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదించింది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, టీఎన్, ఈ, పీ వీసాల ఫారం ఐ-129 పొడిగింపులకు ఇది వర్తిస్తుంది.

ప్రభుత్వ అంచనాలే చెబుతున్నవి

  • ఏటా ప్రభావితమయ్యే దరఖాస్తులు: 2,08,429
  • అదనపు ఆధారాల అభ్యర్థనలు (ఆర్‌ఎఫ్‌ఈ): ఏటా సుమారు 6,044
  • ఆర్‌ఎఫ్‌ఈ వస్తే ప్రాసెసింగ్ మధ్యస్థ సమయం 76 రోజులు; రాకపోతే 12 రోజులు
  • సైట్ తనిఖీల్లో అక్రమాలు: డిఫరెన్స్ అమల్లో ఉన్న 2022–25లో 22.39%, లేని 2018–20లో 16.77%

భారతీయులపైనే ఎక్కువ భారం

యూఎస్‌సీఐఎస్ 2023 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం ఆమోదించిన 3,86,318 హెచ్-1బీ దరఖాస్తుల్లో 72.3% భారత్‌లో పుట్టినవారివే. కొనసాగింపు ఉద్యోగాల కోసం వచ్చిన 2,67,370 ఆమోదాల్లో 2,10,561 (78.8%) భారతీయులవే. అంటే పొడిగింపు నిబంధనలు మారితే ఎక్కువగా ప్రభావితమయ్యేది భారతీయులే.

డిఫరెన్స్ వల్ల రుజువు బాధ్యత దరఖాస్తుదారు నుంచి అధికారిపైకి మారుతోందని డీహెచ్ఎస్ వాదిస్తోంది; అధికారులు పాత ఆమోదాలను పరిగణించవచ్చని కూడా చెబుతోంది. అభిప్రాయాలను నవంబర్ 13 లోగా regulations.gov ద్వారా మాత్రమే పంపాలి. తుది నిబంధన వచ్చే వరకు ఇప్పటి నియమమే అమల్లో ఉంటుంది.