విజయవాడ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య వివాదం తీవ్రమైంది. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారంటూ వైసీపీ నేతలు సోమవారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం ఎస్ఈసీకి 17 కొత్త ఫిర్యాదులు అందజేసింది. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశామని, పల్నాడు, కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో పోలీసుల అండతో దాడులు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. మంగళసూత్రం బరువు, విలువ చూపలేదన్న కారణాలతో నామినేషన్లను తిరస్కరించారని, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించిన సీసీటీవీ పర్యవేక్షణ అమలు కావడం లేదని పేర్కొంది.

మరోవైపు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఆరోపణలను కొట్టిపారేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాల తర్వాత వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్నందున కూటమి శ్రేణుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు గతంలో ఉన్న ₹5 లక్షల నుంచి ₹20 లక్షల నజరానాను ₹15 లక్షల (5 వేలలోపు జనాభా), ₹25 లక్షల (5–10 వేల జనాభా), ₹50 లక్షలకు (10 వేలకు పైగా జనాభా) పెంచిన విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.