వాషింగ్టన్: అమెరికాలో వలస విధానాలపై కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో 2023 ఆర్థిక సంవత్సరం (FY23) నుంచి ఇప్పటివరకు 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేకుండా అమెరికా సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఈ చిన్నారుల్లో ఎవరినీ స్వదేశానికి తిప్పి పంపలేదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
యూఎస్సీబీపీ విడుదల చేసిన వార్షిక వివరాల ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో 730 మంది, 2024లో 517 మంది ఒంటరి భారతీయ చిన్నారులు పట్టుబడ్డారు. ఆ తర్వాత కఠిన సరిహద్దు నియంత్రణలు, వేగవంతమైన బహిష్కరణల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 91కి, 2026 ఆర్థిక సంవత్సరంలో 51కి పడిపోయింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన 2026 అక్టోబర్లో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.
అన్ని దేశాలకు చెందిన ఒంటరి చిన్నారుల సంఖ్యలోనూ ఇదే తరహా తగ్గుదల కనిపించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో అన్ని దేశాల నుంచి సుమారు 1.1 లక్షల మంది ఒంటరి చిన్నారులు అమెరికా సరిహద్దులో పట్టుబడగా, 2025లో 29,584కు, 2026లో 9,190కి, 2026 అక్టోబర్లో 722కు తగ్గింది.
గతంలో కొందరు వలస కుటుంబాలు అమెరికాలో చట్టబద్ధమైన నివాస హోదా పొందేందుకు పిల్లలను ఒంటరిగా సరిహద్దు దాటించేవారని, తాజా కఠిన చర్యలతో ఆ ధోరణి తగ్గిందని ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వయోజనుల అక్రమ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 30,528 మంది భారతీయులను అమెరికా సరిహద్దు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జాబితాలో మెక్సికో, కెనడా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.




